Wednesday, March 4, 2026

తెలంగాణ మీడియాలో అక్రిడిటేషన్ల అలజడి…!గంట సోమన్న,సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణలో మీడియా అక్రిడిటేషన్ వ్యవహారం ఇప్పుడు సందడిగా మారింది.గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ఆలస్యమై,కాలయాపన జరిగింది.ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెండున్నర ఏళ్ళు గడిచిపోయాయి. మీడియా సంస్థల,జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తుల మేరకు మీడియా అకాడమీ,రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టి, తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025ను ఖరారు  చేశారు.జీవో ఎంఎస్ నెం.252 ద్వారా కొత్త నిబంధనలు తీసుకొచ్చి,ఇటీవల (జనవరి 2026లో) కొన్ని సవరణలు (జీవో ఎంఎస్ నెం.103 వంటివి) చేసి, మరింత సమగ్రంగా మార్చినట్లు చెబుతున్నారు.ఎట్టకేలకు ఫిబ్రవరి 9 నుండి అక్రిడిటేషన్ల దరఖాస్తుకు ముహూర్తం పిక్స్ చేశారు. *కీలక మార్పులు మరియు నిబంధనలు*
ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం డెస్క్ జర్నలిస్టుల పోస్టుల్లో కనీసం 33% మహిళలకు రిజర్వ్ చేయాలని,అక్రిడిటేషన్ కోటాలో కూడా వారికి ప్రాధాన్యతను చేర్చారు.డెస్క్ జర్నలిస్టులకు సమాన హక్కులు కల్పించడంలో భాగంగా ఈ సవరణలు చేశారు. అయితే,మొదట్లో డెస్క్ వర్సెస్ ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజనపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.సవరణల తర్వాత డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.*సర్క్యులేషన్ ఆధారంగా అదనపు కార్డులు*2.5 లక్షలకు పైగా సర్క్యులేషన్ ఉన్న ప్రింట్ మీడియాకు మండల్ స్థాయిలో అదనపు కార్డులు, స్పోర్ట్స్,కల్చర్,ఫిల్మ్స్ వంటి కేటగిరీల్లో అదనపు స్లాట్లు కల్పిస్తూ,కొత్త కార్డులు 2 సంవత్సరాలు(2026-2028) వరకు వ్యాలీడ్ ఉండేలా కాలపరిమితి విధించారు.దీనితో ఫిబ్రవరి 9,2026 నుంచి ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమావుతాయని పేర్కొన్నారు.ఇక మీడియా సంస్థలు జర్నలిస్టుల జాబితా సమర్పించాలి.ఆ తర్వాత వ్యక్తిగత దరఖాస్తులు చేసుకువాలి.పాత కార్డులు ఫిబ్రవరి 28,2026తో ముగియనున్నాయి.
*జర్నలిస్ట్ సంఘాల అభ్యంతరాలు*ఇదిలా ఉంటే మొదటి జీవో 252 లో డెస్క్ జర్నలిస్టులను వేరుచేసి,వారికి అక్రిడిటేషన్ ఇవ్వకుండా చేస్తున్నారని టియుడబ్ల్యూజె,డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వంటి సంఘాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. “అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు సమానంగా ఇవ్వాలి” అని డిమాండ్ చేశాయి.కొన్ని సంఘాలు ప్రొటెస్ట్‌లు కూడా చేశాయి.ప్రభుత్వం ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని,జనవరి 2026లో సవరణలు చేసింది. సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 14 సంఘాలతో సమావేశమై, “కార్డుల సంఖ్య తగ్గదు,గతం కంటే ఎక్కువ ఇస్తాం” అని హామీ ఇచ్చారు.అక్రిడిటేషన్ వర్సెస్ మీడియా కార్డ్ అనే తేడా లేదని, అందరికీ సమాన లబ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు. దీనితో ఆన్‌లైన్ అక్రిడిటేషన్ దరఖాస్తులకు లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు. అయినా పెద్ద  పత్రికలు, మీడియం పత్రికలు,చిన్న పత్రికల మధ్య వ్యత్యాసం ఉందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
*అంగడి సరుకుగా మారిన అక్రిడిటేషన్లు*తెలంగాణలో మీడియా అక్రిడిటేషన్ కార్డులు అంగడి సరుకుగా మారాయనే ఆరోపణలు గతంలో బలంగా వినిపించాయి.అర్హత లేని వారు, నకిలీ జర్నలిస్టులు కూడా ఈ కార్డులు పొంది ప్రయోజనాలు పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి.దీంతో వర్కింగ్ జర్నలిస్టులలో అసంతృప్తి పెరిగింది.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,ఈసారి ప్రభుత్వం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ (జీవో 252,తర్వాత సవరణలతో జీవో 103) ద్వారా కొత్తమార్గదర్శకాలు జారీ చేసింది.ఇందులో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
అందులోకీలక అంశాలను పరిశీలిస్తే…ప్రింట్,ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సర్క్యులేషన్,నిరంతర ప్రచురణ వంటి స్పష్టమైన అర్హతలు నిర్ధారించారు.డెస్క్ జర్నలిస్టులకు మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేశారు. వాహనాలపై ‘ప్రెస్’ స్టికర్లు అధికారిక అక్రిడిటేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు.ఈ నిబంధనలతో అక్రిడిటేషన్లు మరింత పారదర్శకంగా,అర్హులకే ఇవ్వాలనే ఆశాభావం కనిపిస్తుంది.గతంలో జరిగిన దుర్వినియోగాలను అరికట్టి, నిజమైన వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాపాడాలనే డిమాండ్ జర్నలిస్టుల నుండి బలంగా వ్యక్తమవుతోంది.*పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు*ప్రభుత్వం అర్హులైన వారికే అక్రిడిటేషన్ ఇవ్వాలనుకుంటే,ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో  ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకకోవాలి. దరఖాస్తుల స్క్రూటినీని,కమిటీ నిర్ణయాలను ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయాలి.ఎవరికి ఎందుకు రిజెక్ట్ అయ్యిందో స్పష్టంగా తెలియజేయాలి.సంఘాలతో సంప్రదింపులు జరపాలి.జర్నలిస్ట్ యూనియన్ల సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.డెస్క్,ఫీల్డ్,డిజిటల్ జర్నలిస్టులందరినీ సమానంగా చూడాలి.వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వచనం,సర్క్యులేషన్ ఆధారాలు,డిజిటల్ మీడియా రూల్స్ మరింత స్పష్టంగా ఉండాలి.అవాస్తవ సంస్థలు,ఫేక్ జర్నలిస్టులను ఫిల్టర్ చేయడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ బలోపేతం చేయాలి.మీడియా సంస్థల,జర్నలిస్తుల అర్హతలు స్పష్టంగా ప్రదర్శించాలి.ప్రెస్ స్టికర్లు అక్రిడిటేషన్ ఉన్నవారికే అనుమతించడం మంచిదే,కానీ, అవి దుర్వినియోగం జరగకుండా చెక్ చేయాలి.ప్రస్తుతం అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తి స్వింగ్‌లో ఉంది.అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ (డెస్క్,ఫీల్డ్,డిజిటల్)పారదర్శకంగా కార్డులు ఇవ్వడమే జర్నలిజానికి ఆదర్శం.ఇది మీడియా స్వేచ్ఛకు,జర్నలిస్టుల గౌరవానికి బలం చేకూరుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!