Wednesday, March 4, 2026

చిన్నగూడెం గుండ్లకాడి జాతర వైభవం ప్రారంభం

ప్రతాపగిరిపై శ్రీశ్రీశ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఘన శ్రీకారం

ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి వారం రోజుల పర్వదినాలు

400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యమైన క్షేత్ర మహిమ..గ్రామ ప్రజల అచంచల విశ్వాసం

భక్తుల రద్దీకి సిద్ధమైన ప్రతాప పర్వత గిరి.

ప్రజాశక్తి, నల్లగొండ ఫిబ్రవరి 28:విద్యా, ఉద్యోగ రంగాలకు మాత్రమే కాదు, పుణ్యక్షేత్రాలకు కూడా ప్రసిద్ధి చెందిన నాటి నీలగిరి, నేటి నల్లగొండ జిల్లాలో చిన్నగూడెం గుండ్లకాడి జాతర ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. నల్లగొండకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని పెద్దవూర మండలం శిరసనగండ్ల శివారులో గల చిన్నగూడెం గ్రామ సమీపంలోని గుండ్ల సమూహాలతో అలరారే ప్రతాపగిరి పర్వత గుహలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి జరిగే మహోత్సవమే ఈ గుండ్లకాడి జాతర.

గుహలో స్వామి – గ్రామ హృదయంలో విశ్వాసం

ప్రతాపగిరి గుహలో కొలువై ఉన్న స్వామి శేషరూపంలో సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారనే విశ్వాసం స్థానికంగా బలంగా ఉంది. నాగు పాము రూపంలో మొగలి రేకుల పరిమళంతో, తెల్లని కేశపాశాలతో దర్శనమిస్తారనే నమ్మకం తరతరాలుగా గ్రామస్తుల హృదయాల్లో నిలిచింది.

గ్రామ ప్రజల విశ్వాసం ప్రకారం స్వామి గ్రామాన్ని కాపాడే గ్రామదేవత స్వరూపుడు. ఏదైనా విపత్తు సంభవించే ముందు గుట్టపై దీపాల కాంతి కనిపిస్తుందని, లేదా పామురూపంలో దర్శనమిచ్చి హెచ్చరిక ఇస్తారనే కథనాలు పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. పంటలు బాగా పండాలంటే, కష్టాలు తొలగాలంటే, పిల్లలు లేని దంపతులకు సంతానం కలగాలంటే గుండ్లపహడ్‌పై ఉన్న తీర్థజలంతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నమ్మకమే ప్రతి సంవత్సరం వేలాది మందిని జాతరకు రప్పిస్తోంది.

సహజ అద్భుతాలు – విశ్వాసానికి ఆధారం

ప్రభుత్వ సర్వే నెం. 251 ప్రకారం 21 ఎకరాలు 10 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టపై సహజంగా ఏర్పడిన నీటి గుండాలు ప్రత్యేక ఆకర్షణ. వాటిలో ఎల్లప్పుడూ నీరు నిలిచి ఉండటం, పెద్ద సాలగ్రామాలు కనిపించడం భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంచుతోంది. ఆ నీటిని పిల్లల గుండుకు పోస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో అనేక మంది కుటుంబాలు ఇక్కడ మొక్కులు పెట్టుకుంటారు.

చరిత్ర చెబుతున్న క్షేత్ర వైభవం

7వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు అనే రాజుకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి ఆలయం నిర్మించాలని ఆజ్ఞాపించారని స్థానిక పురాణ గాథ చెబుతోంది. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.తరువాత యడవల్లి వంశానికి చెందిన రెడ్డి దొరలు ఆలయ అభివృద్ధికి కృషి చేసి, తిరుపతిలోని కందాల వంశ అర్చకులను ఆహ్వానించి చిన్నగూడెంలో దేవాలయ నిర్మాణం చేపట్టారు. 400 ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయం తెల్లరాయి, సున్నపు గచ్చు నిర్మాణ శైలితో ప్రత్యేకతను సంతరించుకుంది. గర్భగుడిలో శ్రీమద్ రామానుజులు, నమ్మాళ్వారుల విగ్రహాలు శిల్పకళా శోభను ప్రతిబింబిస్తున్నాయి.వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి గుట్టపైకి చేరడం కష్టమవుతుండడంతో చిన్నగూడెంలోనే ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి నిత్యార్చనలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. రెండు వాగులను ఉభయ కావేరులుగా, చిన్నగూడెంను శ్రీరంగంగా భావించి ప్రతిష్ఠలు చేయడం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక దృక్పథానికి నిదర్శనం.

ఉత్సవాల సంబరం – గ్రామమంతా పండుగ వాతావరణం

ప్రతి ఏడాది తిరునాళ్ల సమయంలో చిన్నగూడెం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను డోలు–సన్నాయి నాదాలతో ప్రతాపగిరి గుట్టపైకి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రభల, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాన్ని ఉత్సాహంతో నింపేస్తాయి. జిలుగు వెలుగుల విద్యుత్ దీపాలతో ఆలయం అలంకరించబడింది.ప్రస్తుతం కందాల వంశస్తుల పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవెల్లి వంశస్థుల ఆధ్వర్యంలో ఆలయం, కల్యాణ మండపం జీర్ణోద్ధరణ పనులు పూర్తి కాగా, ఈసారి కల్యాణోత్సవం రోజున ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు.

భక్తులకు ఆహ్వానం

ఈ సంవత్సరం ఉత్సవాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి (01-03-2026) నుంచి ఫాల్గుణ శుద్ధ చవితి (07-03-2026) వరకు వారం రోజుల పాటు జరుగనున్నాయి. గ్రామ ప్రజలు తమ ఇళ్లలో మంగళహారతులు, అన్నదానాలు నిర్వహిస్తూ స్వామి సేవలో తలమునకలై ఉన్నారు.

“స్వామి ఉన్నాడు కాబట్టే మా ఊరు క్షేమంగా ఉంది” అనే నమ్మకం చిన్నగూడెం ప్రజల గుండెల్లో గాఢంగా నాటుకుపోయింది.

ప్రతాపగిరిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం చరిత్ర, విశ్వాసం, గ్రామభక్తి కలిసిన ఆధ్యాత్మిక మహోత్సవంగా మరోసారి భక్తులను ఆహ్వానిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!