Monday, January 26, 2026

అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల సస్పెండ్-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజాశక్తి,నల్లగొండ నవంబర్ 10;
ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా రైతుల పొలం వద్దనే కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు పంపించినందుకు గాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ,ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫ్రీన్ ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, ఆలగడప వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ సి ఈ ఓ కే. సైదులు ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.సన్న రకం ధ్యానాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకుండా నేరుగా మిల్లులకు పంపించినట్లు వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ఈ విషయంపై విచారణ నిర్వహించాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ ఈనెల 9 న అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డు దాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి పూర్తి విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా డిసీఓ రికార్డులను పరిశీలించగా, అవంతిపురం -1 ధాన్యం కొనుగోలు కేంద్రానికి 14 మంది రైతులు దాన్యం తీసుకురాగా, బి .అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సైదిరెడ్డి ,సుశీల్ నాయక్ లు వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని తమ పొలం నుండే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి కే. సైదులును కోరారని,ఇందుకు ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి కుమారి ఆఫ్రిన్ తో నిర్ధారణ చేసుకున్న అనంతరం అవంతిపురం కొనుగోలు కేంద్రం నుండి ఆ ఇద్దరు రైతులకు సంబంధించిన (750) బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ట్రక్ సీట్ ఇవ్వడం జరిగిందని, రైతుల పొలాల నుండే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మిర్యాలగూడలోని శ్రీ శివ సాయి రైస్ ఇండస్ట్రీస్ కు పంపించినట్లు తన నివేదికలో పేర్కొన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.తన మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ దింపుకోవడమే కాకుండా, దింపుకున్నట్లు అనుమతి సీట్ జారీ చేయడంతో ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రైతులు పండించిన ధాన్యం ముందుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని అంశాలు పరిశీలించిన మీదట ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాల్సి ఉండగా, ఈ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘించి క్షేత్రస్థాయి నుండే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ట్రక్ సీటు జారీ చేసినందుకుగాను విచారణ నివేదిక ,రికార్డుల ఆధారంగా
ఆళ్లగడప వ్యవసాయ విస్తరణ అధికారి అఫ్రీన్ ను,అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇన్చార్జి కే. సైదులు ఇద్దరిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్నంతవరకు ముందస్తు అనుమతి లేకుండా కార్య స్థానం వదిలి వెళ్ళకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ధాన్యం సేకరణలో ఇలాంటివి మళ్లీ చేస్తే ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!