Tuesday, January 27, 2026

దేశభాషలందు తెలుగు లెస్స…!గీతం జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో వేగా కన్వేయర్స్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల

ప్రజాశక్తి,పటాన్ చెరు అక్టోబర్ 29:
స్థానిక భాషలలో ఆవిష్కరణ, శాస్త్రీయ ప్రసంగాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, మాతృభాషలో వ్యక్తీకరించే ఆలోచనలు తరచుగా లోతైన అర్థాన్ని, సృజనాత్మకతను కలిగి ఉంటాయని వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మూడు రోజుల ద్విభాషా జాతీయ సదస్సు ‘ఫ్రాంటియర్ టెక్నాలజీల పరివర్తన ప్రభావం: పునరుత్సాదక శక్తి, శక్తి సమీకరణ, భూతాపం’ను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)లోని భారతీయ భాషాభివృద్ధి, పోషణకు మద్దతు (వీఏఏఎన్ఐ లేదా వానీ) పథకం సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. గీతంలోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020) దార్శనికతకు అనుగుణంగా, కృత్రిమ మేధస్సు, ఐవోటీ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన సాంకేతికతలపై తెలుగులో చర్చలు జరుగుతున్నాయి.సభను ఉద్దేశించి శ్రీనివాస్ గరిమెళ్ల ప్రసంగిస్తూ, మనం ఆంగ్లంలో మాత్రమే కలలు కనకూడదు లేదా ఆవిష్కరణలు చేయకూడదు అని హితబోధ చేశారు. ఆంగ్లంపై ఆధారపడకుండా అభివృద్ధి చెందిన పలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, భారతీయ శాస్త్రవేత్తలను పేర్లను ఆయన తెలిపారు ఆవిష్కరణలను పెంపొందించడానికి తెలుగులో ఆలోచించి వ్యక్తపరచాలని విద్యార్థులు, పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు. పునరుత్సాదక ఇంధన రంగంలో భారతదేశం యొక్క పురోగతిని గరిమెళ్ల ప్రధానంగా ప్రస్తావిస్తూ, దేశం యొక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2030 నాటికి ప్రస్తుత 180 – 200ల నుంచి 500 మెగా వాట్లకు చేరుకుంటుందని, వాహనాలన్నీ 2040 నాటికి స్థిరమైన శక్తితో పనిచేస్తాయని తెలిపారు.సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించడానికి గీతంను ఎంపిక చేసినందుకు ఏఐసీటీఈకి కృతజ్జతలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ ఇంధనంలో భారతదేశం సాధించిన పురోగతిని, గుజరాత్ లో రాబోయే ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటు, పవన, విద్యుత్ వాహన సాంకేతికతలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఆయన విశదీకరించారు. దక్షిణ కొరియా సహకారంతో గీతం నిర్వహిస్తున్న పవన శక్తిపై పరిశోధనలు, సాధించిన పురోగతిని ప్రొఫెసర్ శాస్త్రి వివరించారు.తొలుత, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ మూడు రోజుల సదస్సు లక్ష్యాలను వివరించారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ హేమరాజు పొల్లాయి స్వాగతోపన్యాసం చేయగా, సహ-సమన్వయకర్త డాక్టర్ మల్లేశ్వరి కరణం వందన సమర్పణ చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో  మేధావులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!